భీమేశ్వర చల్లా బి యస్ మూర్తి, Editor
చాప్టర్ 1 ‘జీవితంలో ఏంచేసినా నువ్వు కథలు రాయవద్దు రామం’’ అని కాలేజీలో తెలుగు మాస్టారు చెప్పినట్లు జ్ఞాపకం. ఆయన పండితులు. చాలా ఉద్గ్రంథాలు పఠించారు. కొన్ని పుస్తకాలు కూడా రాశారు. హరి కథలు కూడా చెప్పినట్లు గుర్తు. అందుచేత ఆయన చెప్పినది నిజమే అయివుంటుంది. అప్పుడు నేను ఆ మాటలను అట్టే పట్టించుకోలేదు. శ్రేయోభిలాషి చెప్పిన సలహా అని, భావించాను. ఈనాడు నేను ఆయన సలహాను ఉల్లంఘిస్తున్నానేమోనని భయంగా ఉంది. అయినా, నేను రాసేది కట్టుకథా కాదు, నవలా కాదు. అయితే ఏమిటది? సరైన సమాధానం నేను చెప్పలేను. కల్పన లేకుండా కథ ఉండదు. కథ లేకుండా నవల ఉండదు. ఇందులో రెండూ లేవు. ఇందులో యథార్థానికి (వాస్తవానికి) దూరములో ఉన్న విషయాలు చాలా తక్కువ. గత జీవితాన్ని పర్యావలోకనం చేసుకోవాలనే వాంఛ ప్రతి మానవుడికి ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది. జీవిత సంధ్యాసమయంలోని వేకువఝామున ఇది మరీ ప్రబలంగా ఉంటుంది. ఈ భూమి మీద ఇంతకాలం బ్రతికాను. నేను సాధించినదేమిటి? ఎంతమందిని దు.ఖపెట్టాను? ఎంతమందిని సుఖపెట్టాను? ఇలాంటి ప్రశ్నలు మనస్సులో మెరుపులా మెరుస్తూ ఉంటాయి. అదే కోరిక నాకు ఈనాడు కలిగింది. అయినా ఎంతో సంశయంతో, ఎంతో అనుమానంతో ఈ ప్రశ్నకి సమాధానం వెదకడం మొదలుపెట్టాను. నా జీవితమంతా వ్యర్ధంగానే గడచిపోయింది. ఆశయంలేని జీవితానికి గమ్యస్థానం కూడా తెలియదు. పుట్టినప్పటి నుంచి, ఇప్పటివరకూ నేనొక దమ్మిడీ కష్టపడి సంపాదించలేదు. చెమటకార్చి నేనెవరినీ పోషించలేదు. చాలా కాలం ఒక స్త్రీ ధనం మీద నేను బతికాను. అది చాలా ‘హీనమైన పని’ అని చాలా మంది అంటారు. ఎందుచేత? పురుషుని ధనం మీదే స్త్రీ ఎందుకు బతకాలి? స్త్రీ ధనం మీద పురుషుడు ఎందుకు బతకకూడదు? ఈ ప్రశ్నలకి సమాధానం నేనెంత ఆలోచించినా నాకు దొరకలేదు. అయినా పురుషుడు స్త్రీ ధనం మీద బతకడం హీనమైనది కాకపోయినా, వాంఛనీయమైనది మాత్రం కాదు. అందరూ ఎవరి దేహాన్ని వారే పోషించుకోవాలి, స్త్రీ అయినా, పురుషుడైనా ఇతరుల మీద ఆధారపడటం వివేకవంతమైనది కాదు. అదిసరే, ‘గతాన్ని గురించి దు.ఖించి లాభమేమిటి?’ అని నిటూర్పు విడిచాను, జీవితంలోని వెన్నెలంతా తెలుగుదేశం బయటే గడిపేశాను. అందులో సగభాగం మంత్రముగ్ధునివలె ఒక స్త్రీ వెంట తిరిగాను. ఈనాడు కూడా నాకు ఆశయం లేదు. నివృత్త జీవితం నుంచి నిష్కృతిని నిరీక్షిస్తున్నాను. కాని ఆ రోజులు వేరు. నా సర్వస్వమూ ఆమె గుప్పిటిలో ఇమిడి ఉండేది. ఇంత నిరర్ధకుడి భారం ఆమె ఎందుకు వహించింది? నా కోసం ఎంతో త్యాగం చేసింది
Read this work at the World Public Library (library card needed).